ఉద్యమం, అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం వెలకట్టలేనిది - హరీష్ రావు
X
ఉద్యోగులది తమది పేగు బంధమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉద్యమ సమయంలో వారు చేసిన కృషి వెలకట్టలేనిదని చెప్పారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన టీఎన్జీఓ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎనలేనిదని హరీష్ రావు ప్రశంసించారు. ఉద్యమ సమయంలో తెలంగాణపై వివక్షకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడేందుకు ఉద్యోగులు వివరాలు అందించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబం లాంటి వారేనన్న ఆయన.. అన్ని విషయాల్లో వారికి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ నెల 13న ఎమ్మెల్యే సతీష్ బాబుతో కలిసి హుస్నాబాద్ టీఎన్జీఓ భవన్ శంకుస్థాపన చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. దుబ్బాకలో టీఎన్జీఓ భవన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సూచించినట్లు చెప్పారు. ఉద్యోగులు, ప్రభుత్వం బండికి ఉండే రెండు చక్రాలలాంటివారన్న హరీష్.. ఉద్యోగుల కోరికలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.