రాజగోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల రహస్య ఒప్పందం బయటపడింది - హరీష్ రావు
X
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని అన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అన్న బీజేపీకి, తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినా ఏ పార్టీ కూడా చర్య తీసుకోలేదని అన్నాకం. ఆ రెండు పార్టీలు కలిసి, తెలంగాణ బిడ్డను ఓడించాలని పథకం వేశాయని విమర్శించారు. సిద్ధాంతం లేని పార్టీలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని హరీష్ రావు స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకొని పని చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. కిషన్ రెడ్డి మరికొందరిని కాంగ్రెస్ పార్టీలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందన్న ఆయన.. కేసీఆర్‌ను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.