కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ సహకారం..రేవంత్కు చంద్రబాబు ఉపకారం : హరీష్ రావు
X
తెలంగాణను అస్థిరపరిచేందుకు ద్రోహులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలవి కక్ష్యపూరిత రాజకీయాలు అన్న మంత్రి.. కేసీఆరే మనకు రక్షఅని చెప్పారు. కిషన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సహకారం అందిస్తే.. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఉపకారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను సంకలో పెట్టుకున్న వాళ్ళు తెలంగాణను ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు హరీష్ రావు అందజేశారు.
కేసీఆర్ పాలనే తమకు కావాలని తెలంగాణ ప్రజలు నినదిస్తున్నారని హరీష్ రావు చెప్పారు. మూడు గంటలు కరెంట్ అన్న పార్టీని తరిమికొట్టి.. మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులకు శాపంగా మారాయని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలతో కమలం పార్టీ ఎంతో మంది రైతుల చావులకు కారణమైందని మండిపడ్డారు. మరోవైపు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ కల్లోలం రేపిందని ఆరోపించారు.
అన్ని వేళల్లో ప్రజలకు అండగా నిలిచిన కేసీఆర్కు ఎన్నికల సమయంలో ప్రజలు అండగా నిలవాలని హరీష్ రావు సూచించారు. దీపం లాంటి బీఆర్ఎస్ ఉండగా శాపం, పాపం లాంటి పార్టీలు రాష్ట్రానికి అవసరమా అని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే హామీలను.. ముందుగా వాళ్లు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు