సాయిచంద్ మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న హరీశ్ రావు
X
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. సాయి చంద్ మరణవార్త విన్న వెంటనే మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, బాల్కా సుమన్ కేర్ హాస్పిటల్ కి వెళ్లి.. సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి హరీశ్ రావు కన్నీరు పెట్టుకున్నారు. అయితే, సాయి చంద్ మృతదేహాన్ని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు.
సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సాయిచంద్ మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర అంటూ.. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు.