దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. పాపం, శాపం లాంటి ఆ పార్టీలెందుకు : హరీష్ రావు
X
తెలంగాణకు దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. పాపం లాంటి బీజేపీ, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకని మంత్రి హరీష్ రావు అన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లుగా ప్రతిపక్షాల పని ఉంటుందని విమర్శించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలుచేస్తున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటే.. మీటర్లు పెడతామని బీజేపీ అంటోందని ఆరోపించారు. కానీ కేసీఆర్ మాత్రమే వారికి అండగా నిలిచారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యుల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ 1 అని చెప్పారు. ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ను చూస్తుంటే న్యూయార్క్లా ఉందని రజినీ కాంత్ అన్నారని హరీష్ రావు గుర్తుచేశారు. వేల కోట్లతో రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలను అమలుచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ప్రథకంలో వారికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల టైంలోనే బయటకు వస్తాయని.. కానీ ప్రజలకు సేవ చేసే నాయకులకే ప్రజలు అండగా నిలవాలని కోరారు.