కొత్త ప్రభాకర్ నిధులు తెస్తే.. రఘునందన్ రిబ్బన్ కటింగ్లు చేసిండు - హరీశ్ రావు
X
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు మూడు సీట్లు కూడా రావని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణను కష్టాల పాల్జేసిన కాంగ్రెసోళ్లను ప్రజలు నమ్మరని చెప్పారు. మిర్ దొడ్డి, అక్బర్ పేట - భూంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక సీటు మాత్రమే వచ్చిందని, ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంటుందని జోస్యం చెప్పారు. బీజేపీకి ఓటేస్తే ఒరిగేదేమీలేదన్న హరీశ్.. ఉప ఎన్నికల్లో రఘునందన్ ఇచ్చిన వధువుకు పుస్తె మట్టెలు, బీడీ, చేనేత కార్మికులకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఎడ్లు బండి, డిగ్రీ కళాశాలలు, రైలు బండి, పరిశ్రమల ఏర్పాటు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
దుబ్బాక అభివృద్ధి కోసం ప్రభాకర్ రెడ్డి నిధులు తెస్తే.. రిబ్బన్ కటింగ్లు మాత్రం రఘునందన్ చేశాడని హరీశ్ విమర్శించారు. గత హామీలు మరిచిపోయిన ఎమ్మెల్యే ఇప్పుడు ఊర్లు, భూములు పోతాయని కొత్త పుకార్లు పుట్టిస్తున్నాడని ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెట్టనందుకే రూ. 25 వేల కోట్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అని, తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.