కేసీఆర్కు పనితనం తప్ప పగతనం లేదు : హరీష్ రావు
X
కేసీఆర్కు పనితనం తప్ప పగతనం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. కేసీఆర్కు పగతనం ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉండేవాడని వ్యాఖ్యానించారు. తొమ్మిదన్నేళ్లలో కరువు, కర్ఫ్యూలు లేవని.. కాంగ్రెస్ వస్తే మళ్లీ అవి వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విషయం తక్కువ విషం ఎక్కువని విమర్శించారు.
నల్గొండకు కాంగ్రెస్ ఏం చేసిందని హరీష్ రావు ప్రశ్నించారు. నల్గొండకు బీఆర్ఎస్ మూడు మెడికల్ కాలేజీలతో పాటు బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ ఇచ్చిందని చెప్పారు. మిర్యాలగూడలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రమంత్రి పార్లమెంట్లో చెప్పారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని అన్నారు.
రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ది కుటుంబ రాజకీయాలు అయితే రాహుల్ది ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని.. పక్కపార్టీల నేతల కోసం కాపుకాసుకొని కూసున్నారని ఎద్దేవా చేశారు. కర్నాటకలో కరెంట్ కటకట నెలకొందని.. 5గంటల కరెంట్ కూడా సక్కగా ఇవ్వకపోడంతో రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. కాంగ్రెస్ను నమ్మితే రాష్ట్రం ఆగమవుతోంది.. తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.