తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆలోచన చెయ్యాలి.. మంత్రి జగదీశ్ రెడ్డి
X
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ను అనుచితాలంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మళ్ళీ 2004ను గుర్తు చేశాయని, చంద్రబాబు నాయుడు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు ఇక్కడే తిరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు శాశ్వత విముక్తి లభించింది అనుకుంటున్న సమయంలో రేవంత్ రూపంలో మళ్ళీ చంద్రబాబు వచ్చాడన్నారు. వ్యవసాయమే దండగా, ఉచిత కరెంట్ ఎందుకు అని చంద్రబాబు నాయుడు ఆనాడు అన్నాడని, మళ్లీ రేవంత్ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు.
రైతులకు కాంగ్రెస్ పార్టీ శత్రువని...శత్రు వైఖరితో పాలన చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు కరెంట్ ఇవ్వడం లేదు...మేము 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాట తప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ధర్నాలు చేసిన వాళ్లలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అంత ఏడుపు అని ప్రశ్నించారు. దేశంలో లక్షల కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టి విదేశాలకు పోయిన వాళ్ళ పై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు లేదని గట్టిగా అడిగారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ కావాలి కానీ...రైతులకు మాత్రం 24 గంటల కరెంట్ వద్దా? అని అన్నారు. కాంగ్రెస్ జెండా పట్టుకోని తిరుగుతున్న రైతులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆలోచన చెయ్యాలి అని మంత్రి సూచించారు.