Medigadda: మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపు
X
బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణలో పాలనను గాడిలో పెడుతున్నామని అన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిపాలన ఇంచార్జ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత పాలకులు అసమర్థ పాలనతో ప్రతి శాఖ వేల కోట్ల రూపాయలు నష్టాలతో ఉందన్నారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒక్క ఎకరాకు నీరు రాలేదని, కాళేశ్వరం డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ కనీసం కాలువలు కూడా తవ్వలేదని విమర్శించారు. మంగళవారం ఖమ్మంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
గత పాలకులు ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులని అన్నారు. మేడిగడ్డ కుంగటం విధ్వంస చర్య అని కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుల ద్వారా నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే వాటిని తుంగలో తొక్కి లక్షల కోట్ల నిధులను దారి మళ్లీంచారని విమర్శించారు.
ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో పోటీపడి విధంగా కృషి చేస్తామన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితో కూడిన పాలన ప్రజలకు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు.