KCR కాలిగోటికి కూడా సరిపోరంటూ సీఎంపై కామెంట్స్.. KTR కు కోమటిరెడ్డి కౌంటర్
X
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చదువుకొని బుద్ధి ఉన్నవారెవరైనా.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా అనరని అన్నారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లడుతూ.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్) ఫామ్ హౌస్‌లో పడుకోబెట్టాడని విమర్శించారు. రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది మీలాగా పూటకో మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు.కేసీఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్‌కు పోతుంటే వాసాలమర్రిలో శ్మశానాలు అడ్డంగా ఉన్నాయని గ్రామాన్ని దత్త తీసుకొని వదిలేశాడని మండిపడ్డారు.
ఇక ఇదే సభలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా ZP చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. గూడూరు గ్రామ పంచాయతీ ప్రారంభ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా స్టేజ్ పై బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు సందీప్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకుని, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సందీప్ రెడ్డి ఓ బచ్చా అంటూ స్టేజ్ పై నుంచే గెంటివేశారు. దీంతో అక్కడున్న మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. అనాటి కాంగ్రెస్ నేత మాధవరెడ్డీ ఒక మహా నాయకుడని, ఆయన కడుపున పుట్టిన సందీప్ రెడ్డి ఓ పిలగాడు అని కార్యకర్తలకు సర్ధిచెప్పారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యే , ఎంపీగా , మంత్రిగా రాజకీయం చేసే సమయానికి కనీసం వర్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా సందీప్ రెడ్డి లేడని వ్యాఖ్యానించారు.