Home > తెలంగాణ > ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెండ్ రూం ఇళ్ల పంపిణీ : కేటీఆర్

ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెండ్ రూం ఇళ్ల పంపిణీ : కేటీఆర్

ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెండ్ రూం ఇళ్ల పంపిణీ : కేటీఆర్
X

వచ్చే ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెండ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్ రూం ఇళ్ల పంపిణీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి 500, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి 300, సనత్‌నగర్ నియోజకవర్గానికి 500, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్‌ బెడ్ రూం ఇళ్లలో 30 వేల ఇళ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తైందని.. మిగిలిన 70 వేల ఇళ్లను వచ్చే నెల, నెలన్నర వ్యవధిలో పేదల చేతికి అందిస్తామని చెప్పారు.

డబుల్‌ బెడ్ రూం ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వొద్దని కేటీఆర్‌ తెలిపారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని గతంలో పెద్దలు అనేవారని.. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ మాత్రం..ఇల్లు నేనే కట్టిస్తా...పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారని కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడుతున్నాయని చెప్పారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తమదేనని తెలిపారు. అర్హులై ఉండి ఇళ్లు రాని వాళ్లకు భవిష్యత్తులో ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రూ.50వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో డబుల్‌ బెడ్ రూం ఇల్లు కట్టేందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు పది లక్షలు. కానీ లక్ష ఇళ్లకు మార్కెట్‌ విలువ 50వేల నుంచి 60 వేల కోట్ల వరకు ఉంది. ఆ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం పేదల చేతిలో పెడుతుంది. ఒక్క రూపాయి లంచం చెల్లించాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా ఇళ్లను అందిస్తున్నాం’’ అని కేటీఆర్ చెప్పారు. కాబట్టి ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.


Updated : 21 Sept 2023 3:53 PM IST
Tags:    
Next Story
Share it
Top