బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖర్మ బీఆర్ఎస్కు లేదు - మంత్రి కేటీఆర్
X
ప్రధాని నరేంద్రమోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ.. గాంధీని పూజిస్తాడో లేక గాడ్సేను పూజిస్తాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన టెర్రరిస్టు నాథూరామ్ గాడ్సే అని కేటీఆర్ మండి పడ్డారు. అలాంటివాడిని ఆరాధించే దిక్కుమాలిన పార్టీ దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. అలాంటి దుర్మార్గులతో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదని అన్నారు. ఓటుకు నోటు దొంగను పార్టీ ప్రెసిడెంట్గా పెట్టుకున్నకాంగ్రెస్ నేతలు ఎన్ని మాటలు మాట్లాడినా నమ్మొద్దని కేటీఆర్ చెప్పారు.
బీజేపీకి, బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉందన్న ఆరోపణలపైనా కేటీఆర్ స్పందించారు. ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా దేశంలో ఏ పార్టీ వ్యక్తైనా మాట్లాడారా అని అన్నారు. మోడీ ఏం చేశాడని ఆయనతో అంటకాగాలని ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోడీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎవరి ఖాతాలోనైనా ఆ డబ్బులు పడ్డాయా అని జనాన్ని అడిగారు. బండి సంజయ్ మోడీని దేవుడని చెబుతున్నాడని, సిలిండర్ ధర, పెట్రోల్, నిత్యాసవరాలు పెంచినందుకు ఆయన దేవుడయ్యాడా? అని మంత్రి ప్రశ్నించారు.
పసుపు బోర్డు ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు ఓటు వేయాలని బీజేపీ నేతలు అంటున్నారని, జనం పొరపాటున కూడా ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఓటు వేయొద్దు అని కేటీఆర్ సూచించారు. మతం పేరు మీద చిచ్చుపెట్టడం.. నాలుగు ఓట్లు డబ్బాలో వేసుకోవడం తప్ప మోడీ ప్రజల కోసం, పేదల కోసం ఆలోచించండం లేదని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఆయన.. 9 ఏండ్లలో ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశాడు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
అంతకు ముందు జగిత్యాల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాలలో రూ. 40 కోట్ల వ్యయంతో 20 ఎకరాల్లో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, నూకపెల్లి వద్ద రూ. 280 కోట్లతో నిర్మించిన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్ల కేసీఆర్ కాలనీ, మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను హోంమంత్రి మహముద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు.