రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
X
రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు వరమైతే.. కాంగ్రెస్ పార్టీ శనీశ్వరమని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధమన్న రాహుల్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు.
రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదని.. తెలుసుకునే ఆలోచన కూడా లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ వెంటనే స్క్రిప్టైనా లేదా రైటర్నైనా మార్చుకోవాలని సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిందన్న కేటీఆర్.. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కన్నా రేవంత్ రెడ్డి డేంజర్ అని విమర్శించారు. ఆయన దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని.. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడటంపెద్ద వింత అని అన్నారు. తమను గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజలు 11 సార్లు అధికారం అప్పజెప్తే ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటు వేయాలని కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.