Home > తెలంగాణ > కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన కేటీఆర్
X

కరీంనగర్లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సమీకృత కూరగాయల మార్కెట్‌, గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ మీటింగ్ హాల్, పౌర సేవా కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కరీంనగర్‌ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం అడగక ముందే అన్ని ఇస్తోందని చెప్పారు. గతంలో అభివృద్ధి నిధుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి అవసరమో అక్కడ ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడి ప్రారంభోతున్నామట్లు చెప్పిన మంత్రి సిద్ధిపేట తరహాలో అన్ని మున్సిపాలిటీల్లో తడిచెత్త నుంచి ఎరువుల తయారీ జరగాలని అన్నారు.





ఫారిన్ టెక్నాలజీ

విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.224 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ వంతెన ఇదే కావడం విశేషం. ఈ బ్రిడ్జి కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రహదారిని కలుపుతూ మానేరు నదిపై నిర్మించారు. నాలుగు లైన్లతో 500 మీటర్ల పొడవైన ఈ వంతెనకు అవసరమైన కేబుల్‌ను ఇటలీ నుంచి తెప్పించారు. పాదచారుల కోసం బ్రిడ్జిపై ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ నిర్మించారు. ఈ వంతెనపై నుంచి చూస్తే ఒకవైపు మిడ్ మానేర్ రిజర్వాయర్, మానేరు రివర్ ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. వంతెన అందుబాటులోకి రావడంతో జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ మానేరు బ్రిడ్జి రోడ్డు మీదుగా వరంగల్, విజయవాడ వెళ్లే వారికి ఏడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

సండే నో ఎంట్రీ

కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం నుంచి వాహనాలు అనుమతించనున్నారు. అయితే ప్రతి ఆదివారం వాహనాలకు ప్రవేశం ఉండదు. పర్యాటకులు వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జిపై ఫుడ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో మ్యూజిక్, కొరియన్ టెక్నాలజీతో కూడిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కనువిందు చేయనుంది.




Updated : 21 Jun 2023 10:41 PM IST
Tags:    
Next Story
Share it
Top