Home > తెలంగాణ > ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో బెంగ‌ళూరును అధిగమించాం : కేటీఆర్

ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో బెంగ‌ళూరును అధిగమించాం : కేటీఆర్

ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో బెంగ‌ళూరును అధిగమించాం : కేటీఆర్
X

హైద‌రాబాద్ అభివృద్ధికి బ‌హుముఖ వ్యూహాంతో ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. న‌గ‌రంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న చేప‌ట్టి.. ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో బెంగ‌ళూరును అధిగ‌మించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి నగరానికి వచ్చిన మహారాష్ట్ర ప్రతినిధులతో మంత్రి​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ‌త ప‌దేళ్లలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న అనేక అనుమానాలు పటాపంచలు చేస్తూ గత పదేళ్లుగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని కేటీఆర్ చెప్పారు. మౌలిక వసతుల కల్పనపై ఎంత ఎక్కువ నిధులు వెచ్చిస్తే అంత వేగంగా అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. హైదరాబాద్లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ రంగంలోనూ పెట్టుబడులు ఆకర్షించేలా మౌలిక వసతుల కల్పనను చేపట్టామన్నారు.

బెంగళూరును మించి...

హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును వరుసగా రెండేళ్లు అధిగమించినట్లు కేటీఆర్ చెప్పారు. ఐటీ ఎగుమతులతో పాటు ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. ఇప్పటికే తెలంగాణ విధానాలు, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేశాయని గుర్తుచేశారు.

ముంబై తర్వాత..

దేశంలో ముంబై నగరం తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుందని కేటీఆర్ తెలిపారు.నగరంలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాసులను పెద్దఎత్తున నిర్మిస్తున్నట్లు వివరించారు. గ‌త ప‌దేళ్లలో హైద‌రాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింద‌ని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం కొనియాడింది. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించింది.


Updated : 16 Sept 2023 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top