ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా : కేటీఆర్
X
ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యాదినోత్సవం నిర్వహిస్తోన్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. తొమ్మిదేళ్ల ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవాన్ని తీసుకొచ్చామని చెప్పారు. యావత్ దేశానికే తెలంగాణ ప్రభుత్వం పాఠాలు నేర్పుతోందన్నారు.
విద్యార్థులకు టీచర్లు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ‘‘అమెరికాలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు కలుస్తుంటారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలి’’ అని చెప్పారు. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసమన్న కేటీఆర్.. ప్రతి తరగతి గది.. తరగని విజ్ఞాన గని అని చెప్పారు. తరగతి గది నాలుగు గోడలే.. కానీ దేశ భవిష్యత్కు అవే మూలస్తంబాలని చెప్పారు.