కేసీఆర్ ఓడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది : కేటీఆర్
X
హైదరాబాద్.. అమెరికా, న్యూయార్క్లా జోర్దార్ తయారైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం రజినీ కాంత్, సన్నీ డియోల్కి అర్ధమైందని.. కానీ కాంగ్రెస్, బీజేపీ వాళ్లకే అర్ధమవడంలేదని విమర్శించారు. గంగవ్వ కూడా దుబాయ్ కంటే హైదరాబాదే బాగుందని అన్నారని గుర్తుచేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన గోవర్ధన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మీ బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని కేటీఆర్ అన్నారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ సిద్ధాంతమన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని చెప్పారు. పుట్టుక నుంచి చివరి దాక.. ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయని.. అసలు ఎందుకు వేయొద్దో ప్రజలు వారిని నిలదీయాలని కేటీఆర్ సూచించారు. ప్రజలు విపక్షాల మాటలు నమ్మి మోసపోకుండా అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలవాలని కోరారు.