అప్పుడు రెడ్‌టేప్ సర్కార్.. ఇప్పుడు రెడ్‌కార్పెట్ సర్కార్ : కేటీఆర్
X
నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్ యువతదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయని.. నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకొచ్చని మంత్రి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మెట్టుగడ్డలోని గర్ల్స్ ఐటీఐ కాలేజీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.
పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కంపెనీల్లో ఉద్యోగాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. నైపుణ్యం ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థులు భయం కారణంగా ఆగిపోతున్నారని చెప్పారు. విద్యార్థులను ప్రపంచంలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు అదేవిధంగా ఉన్నాయన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్.. ఇపుడు ఇరిగేషన్ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందని కొంతమంది అడుగుతున్నారని.. కానీ ఏం సాధించామో కళ్లముందే కన్పిస్తోందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నామని, ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని.. మూడు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 9 లక్షలు దాటిందన్నారు. హైదరాబాద్ బాగా మారిపోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని గుర్తు చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్తే హైదరాబాద్లో ఉన్నామా లేక న్యూయార్క్లో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు.