సాయిచంద్ హైదరాబాద్‌లో ఉంటే బతికేవాడేమో.. మంత్రి కేటీఆర్
X
గుండెపోటుతో మరణించిన సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన గాత్రంతో రాతి గుండెలను సైతం కదిలించిన ఓ గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో సహచర తమ్ముడిగా పని చేసిన సాయిచంద్ మరణవార్త అందరినీ కలిచివేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్భుతమైన కళాకారుడు సాయిచంద్ ని కోల్పోవడం గుండెల్ని పిండేసినట్లు అయిందన్నారు. అతి చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు.
ఉద్యమంలో తన పాటల ద్వారా సాయిచంద్ అందరిని ఏకం చేశారని, ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. హైదరాబాద్ లో ఉంటే బతికేవాడేమోనని.. వ్యవసాయ క్షేత్రంలో ఇలా జరగడం బాధాకరమన్నారు. అతడి మరణం తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లనున్నారు. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశానవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చూస్తున్నారు. మధ్యాహ్నం సాయిచంద్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది.