బీఆర్ఎస్ను గెలిపిస్తే.. వేములవాడను దత్తత తీసుకుంటా : కేటీఆర్
X
వేములవాడలో బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలా తీర్చిదిద్దుతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీనర్సంహారావు మద్ధతుగా నిర్వహించిన ప్రచార సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక మన్నెగూడను మండలం చేయడంతోపాటు ఒక జూనియర్ కాలేజీని స్థాపిస్తామని చెప్పారు.
వేములవాడలోని కలికోట సూరమ్మ చెరువును పూర్తిచేస్తామని కేటీఆర్ తెలిపారు. కరోనా వల్ల ఆలస్యమైందని.. లేకపోతే ఇప్పటికే చెరువు పూర్తయ్యేదన్నారు. మేడిపల్లి, కథలాపురం, బీమారం సహా కొత్తగా కాబోయే మన్నెగూడ మండలానికి నీళ్లిచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పైసలిచ్చి ఓట్లడుగుతరని.. వారిని అస్సలు నమ్మొద్దని సూచించారు. తుల ఉమకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసిన బీజేపీకి డిపాజిట్ కూడా రానియ్యొద్దన్నారు. గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో.. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.