Home > తెలంగాణ > టీపీసీసీ చీఫ్ అనేది ఏమైనా పీఎం పదవా.. : KTR

టీపీసీసీ చీఫ్ అనేది ఏమైనా పీఎం పదవా.. : KTR

టీపీసీసీ చీఫ్ అనేది ఏమైనా పీఎం పదవా.. : KTR
X

తెలంగాణ ప్రజలకు ప్రతిపక్షాలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత పాలకులు రైతు బంధు, ఇంటింటికి తాగునీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తామని చెబుతున్నారని.. అలాంటప్పుడు వాళ్లకు అధికారం ఎందుకు అని విమర్శించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అని తాము ఆలోచిస్తుంటే.. కానీ సంపద పెంచుకొని, వెనకేసుకోవాలనే తీరుతో ప్రతిపక్షాలు ఉన్నాయని ఆరోపించారు.

తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోసి జైల్లో చిప్ప కూడు తిన్నాడని కేటీఆర్ అన్నారు. ఆయన కూడా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పీసీసీ చీఫ్ అనేది ఒక పదవా అన్న కేటీఆర్.. దానిని ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని విమర్శించారు. అందరి ఖాతాల్లో మోదీ 15 లక్షలు వేశారా అని అడిగారు. కానీ కేసిఆర్ రైతుబంధు, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో వారికి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్ళాలని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని అని మండిపడ్డారు.కేసీఆర్ను జైలుకు పంపుతాం అన్నవాడే షెడ్డుకు పోయాడని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాల గురించి తెలిసిందేనన్నారు. ఆ పార్టీలను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని విమర్శించారు.

మహబూబ్ నగర్లో 14స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందని ఊరు, ఇళ్లు లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు ఐదు రెట్లు పెరిగినట్టు మంత్రి వివరించారు. కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉంటేనే తెలంగాణకు శ్రీ రామరక్ష అని మంత్రి చెప్పారు.


Updated : 19 Aug 2023 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top