రేవంత్ మాటలు.. పులి శాకాహారం గురించి చెప్పినట్లున్నయ్ : కేటీఆర్
X
కాంగ్రెస్ నేతలు ఉద్యమకారులు, అమరువీరులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని.. దానికి సోనియాగాంధీ కారణం కాదా అని ప్రశ్నించారు. అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లు.. హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. రూ. 50లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని నిలదీశారు.
ఉప్పల్ లో స్కైవాక్ టవర్ను కేటీఆర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ను జైల్లో వేస్తామంటూ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని..ఎందుకు జైల్లో వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
‘‘నిన్న నడ్డా కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అది ఎందుకో చెప్పాలి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్నందుకా? కేసీఆర్ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్? మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలి. ఈ 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్లో ఇప్పటికే మైండ్ స్పేస్లో స్కైవాక్ అందుబాటులో ఉంది. తాజాగా ఉప్పల్ చౌరస్తాలోకి స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మెహదీపట్నంలో కూడా స్కైవాక్ అందుబాటులోకి రానుంది’’ అని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని.. ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.