కూకట్‌పల్లి సీటుకు కాంగ్రెస్ అన్ని కోట్లు అడిగిందా.. కేటీఆర్ ఏమన్నారంటే..?
X
కాంగ్రెస్‌లో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కూకట్‌పల్లి సీటు కోసం రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత తనతో చెప్పారని అన్నారు. రాష్ట్రంలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతోందని ప్రశ్నించారు. డబ్బుతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. కానీ ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు.
కర్నాటక నుంచి తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.42 కోట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని.. అందులోని 8 కోట్లు కొడంగల్ చేరినట్లు తనకు సమాచారం ఉందని చెప్పారు.
పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ చెప్పారు. త్వరలో చాలా మంది ప్రముఖలు బీఆర్ఎస్లో చేరతారన్నారు. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని.. కాంగ్రెస్‌లో సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని రాసిచ్చింది మాత్రమే చదువుతారని విమర్శించారు.
బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ అన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని చెప్పారు. బీజేపీతో స్నేహముంటే మోదీని ఎందుకు తిడుతామని అడిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పే అబద్ధాలకు హద్దే లేదని విమర్శించారు. తాము ప్రతీకార రాజకీయాలు చేయడం లేదన్న ఆయన రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని కేటీఆర్ చెప్పారు. తాను జీహెచ్ఎంసీ, సిరిసిల్ల, కామారెడ్డిలో ప్రచారం చేస్తానని వివరించారు. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామన్నారు. తమకు గతంలో మాదిరిగా 88 సీట్లు రావోచ్చని అభిప్రాయపడ్డారు. హుజురాబాద్‌లోనూ తామే గెలుస్తామని.. ఈటల మరో 50 చోట్ల పోటీ చేసినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.