Home > తెలంగాణ > దక్షిణాది గొంతులను అణచివేయాలని చూస్తే... : కేటీఆర్‌

దక్షిణాది గొంతులను అణచివేయాలని చూస్తే... : కేటీఆర్‌

దక్షిణాది గొంతులను అణచివేయాలని చూస్తే... : కేటీఆర్‌
X

డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‌లో భాగంగా దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తే బలమైన ప్రజా ఉద్యమాన్ని కేంద్రం ఎదుర్కోవలసి వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి ఆయన ప్రత్యేక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు ఇండియా టుడే డిలిమిటేషన్ కథనాన్ని జతచేశారు.

‘‘ఈ డిలిమిటేషన్ టేబుల్ లో ఇచ్చిన సంఖ్యలు సరైనవి అయితే దక్షిణాదిన బలమైన ప్రజా ఉద్యామానికి ఇది దారితీస్తుంది. మనమంతా భారతీయులం. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం. పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక.. దాంట్లో మా ప్రజల గొంతులను అణచివేయాలని చూస్తూ మౌనంగా ఉండం. కేంద్రం అన్నింటిని వింటుందని.. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దేశంలో ప్రస్తుత జనాభా ప్రకారం పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్లు పెరగనుండగా.. దక్షిణాదిలో భారీగా స్థానాలు కోల్పోనున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు 32 స్థానాలు కలిసిరానుండగా.. దక్షిణాది రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోతాయి. తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్‌ స్థానాలుండగా.. డీలిమిటేషన్‌ తర్వాత 31కి తగ్గుతాయి. తెలంగాణ, ఏపీ నుంచి ఎనిమిది, కేరళ ఎనిమిది, కర్నాటక రెండు స్థానాలు కోల్పోతాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.




Updated : 25 Sep 2023 4:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top