ఎవరు రైతుబంధో.. ఎవరు రాబందో ప్రజలు గుర్తించాలి : కేటీఆర్
X
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆనాడు ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్తే.. నేడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ చాటిచెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతును రాజుగా చేసేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. కాంగ్రెస్ హామీలకు పొంతన ఉండదని సెటైర్ వేశారు. టికెట్లు ఇవ్వలేదని కొందరు పార్టీని వీడడంతోపాటు కేసీఆర్ను విమర్శిస్తున్నారని.. అటువంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు కోట్లు వసూల్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో అయిపోయిందని.. అటువంటి పార్టీ గ్యారెంటీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 11సార్లు వాళ్లకు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చూశారని ప్రశ్నించారు. ఆరు దశాబ్దాలు కరెంట్, నీరు ఇవ్వకుండా ప్రజలను సతాయించారని చెప్పారు. 150ఏళ్ల ముసలి నక్క కాంగ్రెస్ అన్న మంత్రి.. ఆకాశం నుంచి పాతాళం వరకు అన్ని కుంబకోణాలే అని ఆరోపించారు.
70 లక్షల మంది రైతులకు 73వేల కోట్ల రైతుబంధు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అదేవిధంగా రైతుబీమా, రుణమాఫీ, సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. ఎవరు రైతుబంధో.. ఎవరు రాబందో అని ప్రజలు గుర్తించాలన్నారు. 43వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నిరాంటకంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని.. ఆగం కావొద్దని సూచించారు.