రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించుకోండి - మంత్రి కేటీఆర్
X
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ సహా జిట్టా బాలకృష్ణ, ఏపూరి సోమన్న తదితరులు పార్టీలో చేరడం గొప్ప విషయమని అన్నారు.
రాష్ట్రాన్ని పదేళ్లలో ఎంతో అభివృద్ది చేసిన కేసీఆర్‌ను గద్దె దిగమనడం, విపక్ష పార్టీల మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్కసారి చాన్స్ ఇవ్వమని కోరుతున్న కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. 11సార్లు అవకాశమిచ్చి 55 ఏళ్ల పాటు అధికారం అప్పజెప్పినా హస్తం పార్టీ ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో గ్రామగ్రామానా చర్చ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ప్రజలు కట్టుబడి ఉన్నారని, మరోసారి కేసీఆర్ను సీఎంగా గెలిపించి హ్యాట్రిక్ విజయం అప్పజెప్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.