Home > తెలంగాణ > తెలంగాణ అభివృద్ధిపై విపక్షాలకు కేటీఆర్ సవాల్

తెలంగాణ అభివృద్ధిపై విపక్షాలకు కేటీఆర్ సవాల్

X

రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కన్నా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరారు. ప‌ల్లెప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్పకాలిక చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఇంటింటికీ మంచి నీళ్లిచ్చిన రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానం తెలంగాణదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, దేశంలో వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ ఉందని చెప్పారు. దేశంలో రైతులకు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న కేటీఆర్.. ఐటీ ఉద్యోగాలు క‌ల్పనలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. తాను చెప్పింది త‌ప్ప‌ైతే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కన్నా బెట‌ర్‌గా ఉంద‌ని రుజువు చేస్తే రేపు పొద్దున ఫస్ట్ అవ‌ర్‌లో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

అంతకు ముందు సైతం విపక్షాల తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. 9 ఏండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినా ప్రతిపక్షాలకు మాత్రం అదేమీ కనపడటం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన విపక్షాలకు చురకలు అంటించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తాయని ఆశించామని అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మంచిని గుర్తించలేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో రాజకీయ భావదారిద్ర్యం పెరిగిపోయిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పల్లెలు, పట్టణాలు బాగుపడుతుంటే విపక్ష సభ్యులు కళ్లుండీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం సైతం అభివృద్ధిని గుర్తించి అవార్డులు ఇస్తున్నా వారు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తత్త్వ బోధకుడు, తొలి దళిత మహాకవి దున్న ఇద్దాసు చెప్పిన తత్వగీతాన్ని కేటీఆర్ సభలో చదివి వినిపించారు.





Updated : 5 Aug 2023 9:01 PM IST
Tags:    
Next Story
Share it
Top