కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదు.. ఉత్తుత్తి కరెంట్ - మంత్రి కేటీఆర్
X
కాంగ్రెస్ కు ఎన్నిసార్లు అధికారం ఇచ్చినా ప్రజల కోసం చేసేదేమీ ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదగురిగుట్టలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదు.. ఉత్తుత్తి కరెంటని కేటీఆర్ సటైర్ వేశారు.
2014లో యాదగిరి గుట్ట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. యాదగిరిగుట్ట గురించి యావత్ ప్రపంచం చర్చించుకునేలా కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. డిసెంబర్ 3 తర్వాత కొండపైకి ఆటోలు వెళ్లేలా ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్తానని అన్నారు. గొంగిడి సునీతను మళ్లీ గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురంను మండలాలుగా చేయడంతో పాటు ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.