Home > తెలంగాణ > హైదరాబాద్కు చేరిన రామగుండం పంచాది.. అసంతృప్తులకు కేటీఆర్ పిలుపు..?

హైదరాబాద్కు చేరిన రామగుండం పంచాది.. అసంతృప్తులకు కేటీఆర్ పిలుపు..?

హైదరాబాద్కు చేరిన రామగుండం పంచాది.. అసంతృప్తులకు కేటీఆర్ పిలుపు..?
X

పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ హైదరాబాద్కు చేరింది. సొంత పార్టీలో నెలకొన్న విబేధాలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గ రెబల్స్కు కేటీఆర్ నుంచి పిలుపు వెళ్లినట్లు సమాచారం. మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్ను వ్యతిరేకిస్తున్న నాయకులకు హైదరాబాద్ రావాలని సమాచారం పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారంతా మంత్రి కేటీఆర్ తో భేటీకానున్నట్లు సమాచారం.

గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు, రెబల్స్ కు మధ్య వివాదం కొనసాగుతోంది. మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, కేశోరాం సిమెంట్‌ కర్మాగారం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు కోరుకంటికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతితో రామగుండం ప్రజలు విసిగిపోయారని మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే అనుచరులు బ్రోకర్ల అవతారమెత్తి, ఆర్‌ఎఫ్సీఎల్‌లో ఉద్యోగాల పేరిట 750 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్‌ జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. స్థానిక ఉద్యమకారులను, కార్మిక నాయకులను ఎమ్మెల్యే చందర్‌ అణచివేయాలని చూస్తున్నారని, పార్టీని ధిక్కరించి సింహం గుర్తుపై గెలిచిన ఆయన మళ్లీ అదే వాతావరణాన్ని తీసుకువస్తున్నారని ఆరోపించారు. రామగుండంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షురాలు కవిత పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అంటున్నారు. లేని పక్షంలో తమ ఐదుగురిలో ఎవరో ఒకరికి టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడంతో.. రెబల్‌ అభ్యర్థిగా.. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి కోరుకంటి చందర్‌ బరిలో దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 26 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమారపు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్‌లో చేరారు.

Updated : 4 Aug 2023 3:48 PM IST
Tags:    
Next Story
Share it
Top