ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు.. మోదీకి కేటీఆర్ ప్రశ్న
X
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై స్పందించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పుట్టుకను వ్యతిరేకించిన వ్యక్తి నరేంద్ర మోదీ అని... తెలంగాణ పట్ల నర నరాన విషం నింపుకున్న వ్యక్తి అని అన్నారు. ఏం మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పుణ్యకాలమంతా అయిపోయాక.. తొమ్మిదేళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఏం చేయడానికని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ. తెలంగాణకు మాత్రం 520 కోట్లతో వ్యాగన్ ఫాక్టరీనా. మాకేమైనా భిక్షం వేస్తున్నారా. ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా ఎందుకు వస్తున్నారు. తల్లిని చంపి, బిడ్డను వేరుచేశారన్న ప్రధాని, మతం పేరు మంటలు రాజేసి.. ఆ మంటలతో చలికాచుకునే ప్రధాని పర్యటనకు మేము ఎవ్వరం హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నాం. రేపటి (శనివారం) ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. మేము ఎవ్వరం హాజరుకాము" అని అన్నారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలు చేస్తూ... "గాంధీభవన్‌లో గాడ్సే దూరిండు. రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ మనిషి, బీజేపీ మనిషి. ఆయన ఏనాడూ మోడీని విమర్శించలేదు. లంగ పనులు చేసే వాళ్లకు ధరణితో ఇబ్బంది. ఎన్డీయే మీటింగ్‌కు బాబు ఎందుకు వెళతారో చెప్పాలి. మోడీతో దేశానికి ఏం మేలు చేసిండు. రాహుల్ గాంధీని ఓ లీడర్‌గా దేశంలో ఎవరు గుర్తించలేదు. రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ ప్రెసిడెంటా. బహురూపు వేషాలు వేస్తే ప్రజలు నమ్మరు. రాహుల్ గాంధీ ముత్తాత గురించి కూడా ప్రజలకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం రోజుల్లో సీఎం కేసీఆర్ మేధావులతో సమావేశం నిర్వహిస్తారని.. కామన్ సివిల్ కోడ్ మీద చర్చ జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు. మోడీ తెలంగాణ పర్యటనను మేము బహిష్కరిస్తున్నాం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/F5lXpfebAQ
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2023