కాంగ్రెస్లో చేరి పిచ్చోడయిండు.. మైనంపల్లిపై మల్లారెడ్డి ఫైర్..
X
మైనంపల్లి హన్మంతరావుపై మంత్రి మల్లా రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన ఓ రౌడీ అని అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. మైనంపల్లిని బీఆర్‌ఎస్‌లో నుంచి గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాడని చెప్పారు. ఆ పార్టీలో చేరాక పిచ్చోడయ్యాడని మండిపడ్డారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి గెలిచే ప్రసక్తేలేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అంటే స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి అని మల్లారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పడమే ఆ పార్టీ పని అని.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఎంపీగా మల్కాజ్ గిరికి ఏం చేశాడని ప్రశ్నించారు. నియోజకవర్గం కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టని రేవంత్.. సీఎం అయ్యాక ఏం ఉద్దరిస్తాడు’’ అంటూ మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. బస్తీ దవాఖానాలతో అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందుతోందని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అందుతోందన్న ఆయన.. ఐటీ రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.