పదేండ్ల బీసీ లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బాగోతం బయటపడ్తది - Minister Ponnam
X
కుల గణనపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ అంశంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. బలహీన వర్గాల కోసమే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన పొన్నం పదేండ్ల బీసీ లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బాగోతం బయటపడుతదని స్పష్టం చేశారు.
కులగణన విషయంలో అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని పొన్నం అన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. అఖిలపక్షం, బలహీన వర్గాల శాసన సభ్యులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయలు కూడా తీసుకుంటామని స్పష్టంచేశారు. కుల గణనకు చట్టం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే చాలన్న ఆయన.. 2011లోనూ తీర్మానం ద్వారానే కులగణన సర్వే జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించే అవకాశం ఉండేది కాదని, కాంగ్రెస్ హయాంలోనూ అదే జరుగుతుందని ప్రతిపక్ష సభ్యులు భయపడుతున్నారని అలాంటి సందేహాలు అక్కర్లేదని అన్నారు. ఇది గత ప్రభుత్వంలా గోప్యంగా చేసుకునే సర్వేకాదని, దీనిపై ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని తేల్చిచెప్పారు.
తమ ప్రభుత్వం ఏం చేసినా పారదర్శకతతో చేస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సర్వే కోసం రూ.150 కోట్లు ఇప్పటికే కేటాయించినట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలో నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదని పొన్నం ప్రశ్నించారు ఆ వివరాలు బయటపెడితే ఇప్పుడు సర్వే ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఇప్పటికైనా సమగ్ర సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కుల గణన విషయంలో కాళ్లు అడ్డంపెట్టి పడేసే పని చేయొద్దని పొన్నం ప్రభాకర్ విపక్ష సభ్యులను కోరారు.