చేసిందంతా చేసి.. వాళ్ల తప్పేది లేనట్లు మాట్లాడుతున్నరు.. బీఆర్ఎస్ నేతలపై పొన్నం ఫైర్
X
బీఆర్‌ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన హాస్యాస్పదంగా ఉందని, చేసిందంతా చేసి చివరకు తమ తప్పేది లేనట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్లాడిన మంత్రి పొన్నం.. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపారని దుయ్యబట్టారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నప్పుడు మానస పుత్రికగా ఉన్న కాళేశ్వరం ప్రతిపక్షంలో ఉంటే బొందల గడ్డగా మారిందా? అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. 'ఏం పీకడానికి పోయిర్రు అని మా పర్యటనపై మాట్లాడారు. స్కూళ్లలో మాకిలాంటి భాష నేర్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై గతంలోనే అధికారులు వ్యతిరేకించారు' అని అన్నారు. ప్రజాధనాన్ని వృథా చేసినందుకు గానూ మేడిగడ్డ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలంతా రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేద్దామంటూ సీఎంకి సవాల్ విసిరిన కేటీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ లో పోటీ చేయాలన్నారు.
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై కూడా ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం. అరవింద్, బండి సంజయ్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారు.. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తరువాత వాళ్లిద్దరూ పిచ్చి లేచి పోతారని అన్నారు. అరవింద్, బండి సంజయ్ పొలిటికల్ లీడర్లు కాదని.. బీజేపీ గాలిలో గెలిచారని సెటైర్ వేశారు. టీవీల్లో బ్రేకింగ్ కోసం మాత్రమే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ పసుపు బోర్డుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి పార్లమెంట్‌లో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు మాట్లాడంగా తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. బండి సంజయ్ తన తల్లిని అవమానించారని మండిపడ్డారు.