Home > తెలంగాణ > Rythu Bandhu : సాగుభూములకే రైతు బంధు.. మంత్రి పొన్నం క్లారిటీ

Rythu Bandhu : సాగుభూములకే రైతు బంధు.. మంత్రి పొన్నం క్లారిటీ

Rythu Bandhu : సాగుభూములకే రైతు బంధు.. మంత్రి పొన్నం క్లారిటీ
X

రాష్ట్రంలో తాజాగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగుభూములకే రైతు బంధు ఇవ్వనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. అయితే సాగుభూములకే రైతు బంధు అంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని అన్నారు. గతంలో ఎలాగైతే రైతు బంధు (Rythu Bandhu ) వచ్చేదో తమ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా (Congress Rythu Bharosa ) కింద అందించనున్నామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి తీరా వారం కూడా కాలేదని, అప్పుడే ప్రతిపక్షాలు తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీలను విజయవంతంగా ప్రారంభించిందని అన్నారు. 100 రోజల్లోపే మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని మంత్రి చెప్పారు. బీసీ బంధుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ నిర్వహించనుందని, విధివిధానాల రూపకల్పన తర్వాత పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు ఇవ్వడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తీరా రెండు రోజుల్లో ఎన్నికలు అనగా రైతు బంధుకు బ్రేక్ వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రైతు బంధు విషయంలో ఈసీ నిబంధనలను పాటించకుండా అప్పుడు మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఎన్నికల్లో ప్రచారం చేశారని.. అందుకే ఈసీ రైతు బంధు నిధులను నిలిపివేసిందంటూ వార్తలు వచ్చాయి. రైతు బంధు నిధుల నిలిపివేతకు కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ బీఆర్ఎస్.. లేదు లేదు బీఆర్ఎస్ పార్టీయే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ పరస్పరం విమర్శలు గుప్పించాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతు బంధు విషయంలో స్పష్టమైన విధివిధానాలు రూపొందించి కేవలం సాగుభూమికే రైతు భరోసా కింద నిధులు ఇచ్చేలా మార్పులు చేస్తోందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ రైతు బంధును ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు.



Updated : 11 Dec 2023 9:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top