Ponnam Prabhakar : వారికి గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
X
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీని పెంచుతున్నట్లు వెల్లడించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం బస్ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూన్ 1వ తేది నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలు అవుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. 2017లో ఆనాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీని ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ పీఆర్సీని ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే ఈసారి 21 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆర్టీసికి సంబంధించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
కొత్త పీఆర్సీ అమలు చేయడం వల్ల ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల వరకూ అదనపు భారం పడుతుంది. ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీలోని 53 వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనాన్ని పొందనున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తు చేశారు.