Ponnam Prabhakar : అమీర్‌పేట్‌లో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
X
అసెంబ్లీ ఎన్నికలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఆ మేరకు వరుసగా హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మీటర్ రీడింగ్ జీరో బిల్లులను మహిళలకు అందజేశారు. ఈ సందర్బంగా 200 యూనిట్ల కంటే తక్కువగా వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి జీరో బిల్లు వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ‘‘ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తామన్నారు.
పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకొని పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేశాం. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత ఏర్పడుతోంది’’ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరోవైపు సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల లబ్దిదారుల వివరాలు ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ శాఖ అధికారులు అందజేశారు.