Home > తెలంగాణ > Puvvada Ajay: నా చేతిలో ఓడి ఇంట్లో కూర్చొంటే మంత్రి పదవి దక్కింది: మంత్రి పువ్వాడ

Puvvada Ajay: నా చేతిలో ఓడి ఇంట్లో కూర్చొంటే మంత్రి పదవి దక్కింది: మంత్రి పువ్వాడ

Puvvada Ajay: నా చేతిలో ఓడి ఇంట్లో కూర్చొంటే మంత్రి పదవి దక్కింది: మంత్రి పువ్వాడ
X

తన చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే ఉమ్మడి జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన చేసింది సున్నా అని విమర్శించారు. సోమవారంనాడు ఖమ్మం ముస్తఫానగర్​లో జరిగిన బీఆర్​ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బీ-ఫాం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే.. ఖమ్మంలోకి కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారని అన్నారు. దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే సినిమా చూపించే వాడినని మంత్రి మండిపడ్డారు. ‘నేను ఖమ్మంలో లేనప్పుడు దొంగల్లా వచ్చారు. ముగ్గురిని కాంగ్రెస్‌లో చేర్చుకుని నానా హంగామా చేస్తున్నారు. దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు వచ్చి మా కార్పొరేటర్లను చేర్చుకోండి’ అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారని, మైండ్ గేమ్ ఆడారని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై ఆయన విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో కూడ ఇదే రకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.

ప్రతీ ఐదేళ్లకోసారి పార్టీ మారుతున్న ఓ మహానుభావుడు మళ్లీ ఖమ్మం వస్తున్నారని.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి పువ్వాడ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముగ్గురు సీఎంలను మోసం చేసిన తుమ్మల.. గతంలో ఖమ్మంలో తనపై ఓడిపోయాడని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఒడిస్తానని, అదేం తనకు పెద్దవిషయం కాదని పేర్కొన్నారు. తుమ్మలకు పాలేరు కుదరంటే ఖమ్మంలో పోటీ చేస్తానంటున్నారని, ఆయనకు ఖమ్మం రెండో ప్రాధాన్యతని, కానీ తనకు మొదటి ప్రాధాన్యత ఖమ్మమేనన్నారు. అదేవిధంగా 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిపించి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గులాబీ ఖిల్లాగా మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఒక్క టికెట్టు కోసం ఇండియా గేటు వద్ద పడిగాపులు కాస్తున్న నాయకులు.. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు తాకనీయమని ప్రగల్బాలు పలుకుతున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.

Updated : 17 Oct 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top