లైసెన్స్ లేకపోవడం ఆత్మహత్యతో సమానం.. మంత్రి పువ్వాడ
X
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. నేడు(శుక్రవారం) ఖమ్మం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మంత్రి హరీష్‌రావు సూచనతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ ప్రారంభించానని తెలిపారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేకపోవడం ఆత్మహత్యతో సమానమన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా నేరమన్నారు. యువతకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి అని తెలిపారు. చాలామంది వాహనాలు నడుపుతున్నారు కానీ ఎవరు లైసెన్స్ తీసుకోవడం లేదని, ఇలా లైసెన్స్‌లు లేకుండా వాహానాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని హెచ్చరించారు.
అందుకే యువతి,యువకుల కోసం ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నానని అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ ద్వారా లైసెన్స్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లైసెన్స్ పొందటానికి అవసరమైన ఫీజు తానే చెల్లిస్తానని.. ఎవరూ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ లైసెన్స్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. ముందు లెర్నింగ్ లైసెన్స్ ఆ తరువాత పర్మినెంట్ లైసెన్స్ అందజేస్తారన్నారు. యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. డ్రైవింగ్‌పై అవగాహనతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌పై యువతకు అవగాహన కల్పిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.
తాను రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత లైసెన్స్‌ల విషయంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నివారించానని చెప్పారు. ఎం.వాలెట్ యాప్ ద్వారా ఆన్లైన్లో వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉండే విధంగా ఏర్పాటు చేసామన్నారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారదర్శకమైన పాలన అందించానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎటువంటి మచ్చ లేకుండా నిర్వహిస్తున్నానని తెలియజేశారు.