గడీల పాలన వద్దని.. గల్లీ బిడ్డల పాలన తెచ్చుకున్నారు : సీతక్క
X
బీఆర్ఎస్ నేతల్లో అధికారం పోయిందనే అక్కసు కన్పిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారని.. కానీ బీఆర్ఎస్ నేతలు ధైర్యం కోల్పోయారని ఎద్దేవా చేశారు. గడీల పాలన వద్దని.. గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని.. వారి కోరిక నెరవేరిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పదేళ్లు దోచుకున్న 420లను ప్రజలు గుర్తించి ఓడించారని ఆరోపించారు.
ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తోందని సీతక్క ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వద్దా అని ప్రశ్నించారు. ఫాం హౌస్లకు సైతం రైతు బంధు తీసుకున్న ఘనత బీఆర్ఎస్ నేతలకే దక్కుతుందని విమర్శించారు. ప్రజాసమస్యలపై నిరసన తెలిపేందుకు ధర్నా చౌక్ లేకుండా చేశారన్నారు. బంగారు తెలంగాణ అని భ్రమలు కల్పించి.. ఆరు లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.