Seethakka : సర్పంచ్ ఎన్నికలపై సీతక్క సంచలన కామెంట్స్
X
సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కష్టమే అన్నారు. గత పాలకులు పదేళ్ల పాటు సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి తమకు అధికారం అప్పజెప్పారని చెప్పారు. ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నను ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం తమ ఆనవాయితీ అని చెప్పారు.
అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని.. అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారమే వారి ఓటమికి కారణమైందని చెప్పారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేయాలని.. లేకపోతే వారిని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారని.. తాము సక్రమంగా పని చేస్తేనే మరోసారి అధికారం ఇస్తారని చెప్పారు.