'ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'
X
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని, బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా.. ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐక్యతకు మారుపేరు పండుగలు, ఉత్సవాలు అని చెబుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు మంత్రి తలసాని.