కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయి.. మంత్రి ఉత్తమ్
X
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రుల బృందం కాసేపటి క్రితం సందర్శించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి బ్యారేజీ పిల్లర్లను పరిశీలించిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... మేడిగడ్డ కుంగడం బాధాకరమైన విషయమని, కుంగినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు నీళ్లివ్వాలని నిర్ణయిస్తే.. తెలంగాణ లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాణహిత ను పక్కన పెట్టి.. మూడు బ్యారేజ్ లు కట్టారన్నారు. 38 వేల కోట్ల రూపాయలతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టు ను పక్కన పెట్టి, రూ.80 వేల కోట్లు వ్యయంతో 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైనదన్నారు.
80 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు అక్టోబర్ 21న మేడిగడ్డ వద్ద పెద్ద శబ్దంతో కుంగిపోతే.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. 80 వేల కోట్ల రూపాయలకు సిడబ్ల్యూసి అనుమతినిస్తే ఇప్పటికే 95 వేల కోట్ల వ్యయం అయ్యిందని, ఇప్పటివరకు ఇంత వ్యయం చేస్తే లక్ష ఎకరాలకు కూడా నీరందలేదన్నారు. మేడిగడ్డ కుంగడమే కాదు.. అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయ్యిందని, ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు వ్యయం భారీగా అయినప్పటికి ఎలాంటి ఆయకట్టు అభివృద్ధి కాలేదన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసేందుకు వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు ఉత్తమ్.
మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ లలో బుడగలు రావడం లాంటి పనులలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాధనంతో పెద్ద ఎత్తున నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. తమకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రాజెక్ట్ పై ఇంతకుముందే సమీక్ష చేశారన్నారు.