Home > తెలంగాణ > పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం.. కేంద్రానికి కేటీఆర్ వినతి

పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం.. కేంద్రానికి కేటీఆర్ వినతి

పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం.. కేంద్రానికి కేటీఆర్ వినతి
X

పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోందని, పట్టణ పేదల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో ఒక జాతీయ పథకం తీసుకురావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన శనివారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురిని కలిసి పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ కోసం నిధులు ఇచ్చి సహకరించాలని కోరారు. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయెల్‌తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. దేశంలోనే వరిధాన్యాన్ని అత్యధికంగా పండిస్తున్న తెలంగాణ నుంచి మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనాలని కోరారు.

పట్టణ పేదల కోసం వచ్చే బడ్జెట్‌లో ఉపాధి హామీపై ప్రకటన చేసేయాలన్న ఆయన రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని హర్దిప్‌తో అన్నారు. పట్టణ పేదరికం భవిష్యత్తులో మరింత ఎక్కువవుతుందని, కేంద్రం వారికి ఉపాధి హామీ పథకం తీసుకొస్తే జాబ్ కార్డుల విధానంలో బతుకు తెరువు కల్పించవచ్చని సూచించారు.

మెట్రో ప్రాజెక్టులపై..

నలుదిశలా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలు ప్రజా రవాణా వ్యవస్థను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కేంద్ర మంత్రితో చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2 బీ పనులకు అనుమతివ్వాలని, ఫేజ్‌-1లోని కారిడార్‌-3లోని నాగోల్‌-ఎల్‌బీ నగర్‌ రైలు విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ అద్భుత విజయాలు సాధిస్తోందన్నారు. కేటీఆర్ శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థ విస్తరణకు రక్షణ భూములు ఇవ్వాలని కోరనున్నారు.

Updated : 24 Jun 2023 3:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top