బీజేపీపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు..ఈటల ఫైర్
X
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై కొంత మంది విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, బీఆరఎస్ కలిసిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో జులై 8న ప్రధాని మోదీ సభ ఉన్న నేపథ్యంలో హన్మకొండలో పర్యటించిన ఈటల మీడియాతో మాట్లాడారు.
" రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోంది. వెంటనే పైకి వెళ్లి మళ్లీ కిందికి పడిపోవడానికి బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదు. తెలంగాణలో 2019 ఎన్నికలతో బీజేపీ విజయపరంపర మొదలైంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటింది. మునుగోడులోనూ నైతికంగా పార్టీనే గెలిచింది. అలాంటి పార్టీపై కొంత మంది విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జులై8న హన్మకొండలో ప్రధాని మోదీ సభ ఉంది. ఇప్పటికే ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంత చేసే పనిలో నిమగ్నమైంది"అని ఈటల రాజేందర్ తెలిపారు.