MLA Lasya Nanditha : సికింద్రాబాద్ లోని ఇంటికి చేరిన లాస్య మృతదేహం..కడచూపుకు తరలివస్తున్న అభిమానులు
X
ఇవాళ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లాస్య కారు ప్రమాదానికి గురికావడంతో...అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పటాన్ చెరులోని అమేధా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడి నుంచి లాస్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ పూర్తి అయ్యాక..లాస్య భౌతిక కాయాన్ని కార్ఖానాలోని ఆమె సొంత ఇంటికి తరలించారు. లాస్యనందితను కడసారి చూపు చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. విగతజీవిగా పడివున్న లాస్యను చూసి ఆమె కుటుంబ సభ్యులు, కార్యకర్తలు రోదిస్తున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు సైతం ఆమెను చివరి చూపు చూసేందుకు తరలివస్తున్నారు.
అయితే అధికార లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికూమారిని ఆదేశించారు. కంటోన్మెంట్ లో లాస్య ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని తెలిపారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇటు లాస్య నందిత మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేగాక మరికాసేపట్లో లాస్యనందిత ఇంటికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు కేసీఆర్. ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. ఇక, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.