Home > తెలంగాణ > ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కుటుంబం వెంటే హరీష్

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కుటుంబం వెంటే హరీష్

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. కుటుంబం వెంటే హరీష్
X

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారు జామున ఓఆర్ఆర్ వద్ద కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5.30 గంటలకు ప్రమాదానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, కుటుంబీకులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి తీవ్ర గాయాలైన లాస్య నందిత అప్పటికే మరణించారు. రాత్రికి రాత్రే తమతో గడిపిన లాస్య నందిత తెల్లారే సరికి విగత జీవిగా కనిపించేసరికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లాస్య నందిత మరణంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఆయన లాస్య కుటుంబ సభ్యులతోనే ఉన్నారు.

అమేద ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లడం, గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం త్వరగా అయ్యేలా హరీష్ రావు చూసుకున్నారు. అలాగే ఆమె ఇంటి వద్దకు చేరుకుని వీఐపీలు, కార్యకర్తలకు, ఆమె అనుచరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయించారు. అంత్యక్రియల సమయంలో కూడా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేయించారు. ఓ వైపు చెమ్మగిల్లిన కళ్లతో ఉంటూ మరో వైపు లాస్య నందిత కుటుంబ సభ్యులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు.

లాస్య నందిత భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా కార్ఖానాలోని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. అధికారిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. లాస్య నందిత అంత్యక్రియల్లో భాగంగా హరీష్ రావు ఆమె పాడెను మోశారు. అంత్యక్రియలు అయిపోయాక మళ్లీ లాస్య ఇంటికి చేరుకుని కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని లాస్య నందిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కూడా లాస్య కుటుంబ సభ్యులతోనే ఉంటూ వారికి ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 23 Feb 2024 4:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top