Breaking News : ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. పీఏపై కేసు నమోదు
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పఠాన్ చెరు పోలీసులు 304ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పీఏ ఆకాష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరికీ దెబ్బలు మాత్రమే తగిలాయని పీఏ ఆకాశ్ తమకు మెస్సేజ్ పంపాడని, లొకేషన్ కూడా షేర్ చేశాడని, అయితే సంఘటనా స్థలానికి వెళ్లే సరికి కారు నుజ్జునుజ్జు అయ్యి ఉందని ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తన ఫిర్యాదులో నమోదు చేశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె పీఏ ఆకాశ్ కూడా ఉన్నాడన్నారు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత తన ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరిందని, శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించినట్లు తెలిపారు.
సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టగా అప్పటికీ లాస్య నందిత బతికే ఉన్నారన్నారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని, పీఏ ఆకాశ్ ఎడమకాలు కూడా విరిగిపోయిందని తెలిపారు. పీఏ ఆకాశ్ ప్రస్తుతం శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదమే అని స్పష్టం చేశారు.