Home > తెలంగాణ > కాంగ్రెస్ నేతతో కీలక భేటీ.. పార్టీ మారనున్న రాజయ్య?

కాంగ్రెస్ నేతతో కీలక భేటీ.. పార్టీ మారనున్న రాజయ్య?

కాంగ్రెస్ నేతతో కీలక భేటీ.. పార్టీ మారనున్న రాజయ్య?
X

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని ఆశావహులు, అసంతృప్తులు వేరే పార్టీ కండువా కప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీ నేతలతో సీక్రెట్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, ఫోన్ కాల్లో టచ్లో ఉంటూ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అసంతృప్తుల్లో చాలావరకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపగా, కొంతమంది బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 ఎమ్మెల్యేల తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ దక్కలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అనుచరులు రాజయ్యను పార్టీ మారాలని కోరారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం మరికాస్త జోరందుకుంది.

సోమవారం (సెప్టెంబర్ 4) కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య సమావేశం అయ్యారు. హన్మకొండలోని నయీంనగర్‌లో జరిగిన ఎస్సీ సమావేశంలో.. ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో రాజయ్య టాపిక్ మళ్లీ మొదలయ్యాయి. త్వరలో రాజయ్య కూడా పార్టీ మారుతూ బాంబు పేల్చబోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే రానున్న ఎలక్షన్స్ లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మధ్య వైరం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. దానికి తోడు రాజయ్యను కాదని బీఆర్ఎస్ పార్టీ.. కడియంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో చాలాకాలంగా రాజయ్య గుర్రుగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన.. ఏదోరకంగా కడియంను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో దామోదర రాజనర్సింహతో సమావేశం అవడం.. రాజయ్య కచ్చితంగా పార్టీ మారతారని చెప్తున్నారు.

Updated : 4 Sep 2023 1:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top