ఫ్లోర్ లీడర్ను త్వరగా ప్రకటిస్తే.. పార్టీకే మంచిది : రాజాసింగ్
X
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను బీజేపీ అధిష్టానం జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని అడుగుతుందని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. శాసనసభ పక్షనేత పదవిపై తనకు ఆసక్తి లేదని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రాజాసింగ్.. బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. త్వరగా బీజేపీ ఎమ్మెల్యేలలో ఎవర్నో ఒకర్ని ఫ్లోర్ లీడర్ గా ప్రకటించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో వెళ్లారని, అందుకే ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యేనే ప్రకటిస్తే బాగుంటుందని అధిష్టానం ఆలోచన. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ కోసం.. తప్పక ప్రచారం చేస్తానని రాజాసింగ్ చెప్పారు. కిషన్ రెడ్డి పిలిస్తే.. తప్పకుండా సికింద్రాబాద్ లో కూడా ప్రచారం చేస్తానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
కాగా ఇవాళ జరిగిన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ సమావేశాలకు బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ లేకుండానే వెళ్లింది. ఫ్లోర్ లీడర్ ఎంపికపై బీజేపీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయానికి రాకపోవడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో ఎవరికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా బీజేఎల్పీ నేత ఎంపిక జరగకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో రాజాసింగ్ మినహా ఎవరికి ఎల్పీనేత పదవి బాగుంటుందన్న కసరత్తులో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.