సంచుల్లో డబ్బులు దించుతున్నరు..ఎమ్మెల్యే సీతక్క సంచలన కామెంట్స్
X
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ములుగు జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ ప్రాంత సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ సంచుల్లో డబ్బును దించుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. " నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ మిడతల దండు వస్తోంది. నేను ఎక్కడా భూకబ్జాలు చేయకపోవడంతో నాపై అక్రమ కేసులు పెట్టించలేకపోయింది. ప్రజల్లో నాకు వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే నన్ను టార్గెట్ చేశారు. ప్రజల మధ్య ఉండటమే నేను చెస్తున్న తప్పా? అసెంబ్లీలో సీతక్క పని తనాన్ని మెచ్చుకున్నారు. మరి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఓడిస్తామని చెబుతున్నారు. నేను ప్రజా సేవను నమ్ముకున్న వ్యక్తిని. నియోజకవర్గ కృషి కోసం పని చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షంలో ఉన్నాను. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. నా చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటాను. బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు ఎంత వరకు కరెక్ట్. నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ తీసుకువచ్చాం. మరి ఏవి. తెలంగాణ వచ్చిన తరువాత కూడా వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశ్నించే గొంతుకను చట్టసభలోకి రాకుండా అడ్డుకోలేరు"అని సీతక్క తెలిపారు.